న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ (BJP) ఓ భారీ కార్యక్రమానికి సిద్ధమవుతోంది. వాద్‌నగర్ నుంచి వారణాసి వరకు 30 రోజుల పాటు ప్రత్యేక యాత్రను చేపట్టనుంది. ఈ యాత్రలో మొత్తం పది బృందాలు పాల్గొననున్నాయి. ప్రధాని మోదీ జన్మదినమైన సెప్టెంబర్ 17న ఈ యాత్ర ప్రారంభమై నెల రోజుల పాటు కొనసాగనుంది.

ప్రధాని మోదీ జన్మస్థలమైన గుజరాత్‌లోని వాద్‌నగర్‌ను, ఆయన లోక్‌సభ నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిని అనుసంధానిస్తూ ఈ యాత్రను నిర్వహించనున్నారు. వాద్‌నగర్, వారణాసి నుంచి ఒకేసారి మొత్తం 10 బృందాలు బయలుదేరతాయి. వారణాసి నుంచి బయలుదేరే బృందాలు వివిధ రాష్ట్రాల మీదుగా ప్రయాణించి నెల రోజుల్లో వాద్‌నగర్ చేరుకోగా.. వాద్‌నగర్ నుంచి బయలుదేరే బృందాలు వివిధ ప్రాంతాల మీదుగా ప్రయాణించి వారణాసికి చేరుకుంటాయి.

ప్రతి బృందం రోజుకు దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించేలా పార్టీ వర్గాలు ప్రణాళిక రూపొందించాయి. ప్రతి బృందంలో 10 మందికి పైగా బైకర్లు ఉండనున్నారు. అలాగే ఇతర కార్యకర్తలు ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించనున్నారు. ఇలా బైక్‌లు, బస్సుల్లో పట్టణాలు, గ్రామాలు, జిల్లా కేంద్రాల మీదుగా ప్రయాణిస్తూ స్థానిక ప్రజలతో బీజేపీ కార్యకర్తలు నేరుగా మమేకం కానున్నారు. రోజంతా ప్రయాణించిన అనంతరం నిర్ణీత ప్రాంతాల్లో బృందాలు బస చేస్తాయి.

బస చేసిన ప్రాంతంలో స్థానిక కార్యకర్తలతో సమావేశాలు, ప్రజా సంబంధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలను ప్రజలకు వివరించనున్నారు. ఈ యాత్రను కేవలం ప్రభుత్వ పథకాల ప్రచార కార్యక్రమంగా మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా బీజేపీ సంస్థాగత బలాన్ని మరింత పెంచే లక్ష్యంతో పార్టీ నిర్వహిస్తోంది. ఈ మహా యాత్ర సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు దిగ్విజయంగా కొనసాగనుంది.

Read latest India News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 1 Sept 2026 | 10:20 PM IST
Tags: