న్యూఢిల్లీ: రాజకీయ నిరసనలతో న్యాయస్థానంపై ఒత్తిడి తీసుకురావాలని చూడటం సరికాదని, అటువంటి ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయ వ్యవస్థను ఎవరూ బెదిరించలేరని వ్యాఖ్యానిస్తూ.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్ష నేతలు సుప్రీంకోర్టు వరకూ చేపట్టిన పాదయాత్రపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పాదయాత్రపై దాఖలైన కేసులో రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తదితరులకు ప్రతిపక్ష నాయకులకు అత్యున్నత న్యాయస్థానం గురువారం నోటీసులు జారీ చేసింది.
మరోవైపు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను సస్పెండ్ చేయాలని, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తో పాటు ఇతర కమిషనర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్, సుప్రియా సూలే, సంజయ్ రౌత్, అసదుద్దీన్ ఒవైసీ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయల్యా బాగ్చీల ధర్మాసనం.. కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.
ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. "రాజకీయ పాదయాత్రలు కోర్టు వరకు రావడం సరైనది కాదు. నోటీసు జారీ చేసినంత మాత్రాన అందులోని వాదనలను అంగీకరించినట్లు కాదని స్పష్టం చేశారు. పిటిషనర్లలో ఒకరి ప్రవర్తనపై తదుపరి విచారణలో ప్రశ్నిస్తామని, ఇచ్చే వివరణ పైనే విచారణ ఆధారపడి ఉంటుందన్నారు. మమ్మల్ని ఎవరూ భయపెట్టలేరు, మేమేమీ ఒంటి స్తంభపు మేడలో కూర్చోలేదు.. మాకు అన్ని విషయాలూ తెలుసు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనల దృశ్యాల రికార్డింగ్లను భద్రపరచాలని ఆదేశిస్తూ కేసు విచారణను వాయిదా వేశారు.


