న్యూఢిల్లీ: దేవీ శరన్నవరాత్రుల ఆగమనాన్ని చాటే అత్యంత పవిత్ర పండుగ 'మహాలయ' (Mahalaya) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మా దుర్గా దేవి ఆశీస్సులు సమాజాన్ని సుఖసంతోషాలు, కరుణ, సహనంతో నింపాలని, దేశ నలుదిశలా శాంతిసమృద్ధి వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ప్రముఖ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (X) ద్వారా తెలుగు, ఇంగ్లీష్, బెంగాలీ తదితర భాషల్లో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. 'మా దుర్గా ఆశీస్సులు మన సమాజాన్ని ఆనందం, దయతో నింపుగాక' అని తన సందేశంలో పేర్కొన్నారు.
మహాలయ పర్వదినంతో పితృ పక్షం (పూర్వీకులకు శ్రాద్ధకర్మలు, తర్పణాలు విడిచే కాలం) ముగియనుంది. అదే సమయంలో శక్తి స్వరూపిణి అయిన దుర్గా దేవి భూలోకానికి ఆగమనం చెందే దేవీ నవరాత్రుల సంబరాలు ఘనంగా ప్రారంభమవుతాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అస్సాం తదితర రాష్ట్రాల్లో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అస్సాంలోని జోర్హాట్ సహా పలు ప్రాంతాల్లో తెల్లవారుజామునే పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చి భజనలు, ప్రత్యేక పూజలతో దుర్గా మాతను భక్తిశ్రద్ధలతో ఆహ్వానించారు.


