ఆమనగల్లు: కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల వ్యవసాయ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని బీఆర్ఎస్ ఆమనగల్లు మండల అధ్యక్షుడు పొనుగోటి అర్జున్రావు విమర్శించారు. గురువారం ఆమనగల్లులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తరచూ ఇస్తున్న విద్యుత్ కోతలతో అన్నదాతల పంటలు కళ్ల ముందే ఎండిపోయే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు కోసం అప్పులు చేసి భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు, కరెంటు లేకపోవడంతో సాగునీరు అందక తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.
రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో 24 గంటల నాణ్యమైన కరెంటుతో పచ్చగా కళకళలాడిన పొలాలు, నేడు కాంగ్రెస్ పాలనలో ఎండిపోతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి స్పందించాలని.. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ను నిరంతరాయంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పంటలు పూర్తిగా దెబ్బతినకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సయ్యద్ ఖలీల్, అనంతుల సైదులు గౌడ్, పరమేష్, రాముల మహేష్ తదితరులు పాల్గొన్నారు.


