న్యూఢిల్లీ: రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు మరోసారి సంచలన తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా మత మార్పిడి ప్రాతిపదికన రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించేందుకు కృత్రిమ మార్గాలను సృష్టించడం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం స్పష్టం చేసింది. మతం మారినంత మాత్రాన రిజర్వేషన్లు, వెనుకబడిన వర్గాల హోదా వంటి ప్రయోజనాలు ఆటోమేటిగ్గా పొందలేరని తేల్చిచెప్పింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా సమర్ధిస్తూ.. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన ప్రత్యేక పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
తమిళనాడులో హిందూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి ఇస్లాం మతంలోకి మారినవారికి 'బీసీ ముస్లిం' కేటగిరీలో కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు వీలుగా 2024 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మతం మారినంత మాత్రాన గతంలో పొందుతున్న రిజర్వేషన్ ప్రయోజనాలను కోల్పోకూడదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ప్రభుత్వ ఈ నిర్ణయం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.
కాగా.. 2015లో హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన సమీర్ అహ్మద్ అనే వ్యక్తి తనను ముస్లిం లబ్బాయిస్ వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తిస్తూ కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా.. స్థానిక తహసీల్దార్ దానిని తిరస్కరించారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా ఈ వివాదం తెరపైకి వచ్చింది. ప్రభుత్వం నోటిఫై చేసిన 7 బీసీ ముస్లిం సామాజిక వర్గాల్లో కేవలం మత మార్పిడితో సభ్యత్వం రాదని, జన్మతః ఆధారంగా సమాజ గుర్తింపు కీలకమని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా ప్రభుత్వానికి చుక్కెదురైంది.


