హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ మంత్రిత్వ శాఖ, రైతు నేస్తం ఫౌండేషన్ సంయుక్తంగా రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. మంగళవారం జరిగిన కార్యక్రమంలో రైతులకు ఎరువుల సరఫరాపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి మంగళవారం నిర్వహించే ఈ కార్యక్రమం నేటితో 105వ ఎపిసోడ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

ఎరువుల కొనుగోలును సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఎరువుల యాప్ 'ఎఫ్‌ఎఫ్ఎస్' (Framework for Fertilizer Sale) ద్వారానే ఎరువులను కొనుగోలు చేయాలని ఈ కార్యక్రమంలో సూచించారు. ఈ యాప్‌తో ఎరువుల పంపిణీ మరింత పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్టే లక్ష్యంగా ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఈ కొత్త యాప్‌ల ద్వారానే ఎరువులు కొనుగోలు చేయాలని రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించారు.

అంతేకాకుండా, సన్నరకాల విత్తన కొనుగోలు వివరాలను డీలర్ల వద్ద ఎప్పటికప్పుడు నమోదు చేయించుకోవాలని రైతులకు తెలియజేశారు. ఒకవేళ వివరాలు నమోదు చేయని యెడల సన్నరకాల ధాన్యానికి ప్రభుత్వం అందించే రూ. 500 బోనస్ వర్తించదని స్పష్టం చేశారు. ఒకవేళ డీలర్ల వద్ద కొనకుండా సొంత విత్తనాలతో సాగు చేసిన రైతులు విధిగా స్వీయ ధృవీకరణ ఇవ్వాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నానో యూరియా వినియోగంపై కూడా రైతులకు అవగాహన కల్పించారు. ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో తక్కువ వర్షపాతం నమోదైందని, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కోరారు. నీటి వనరులను మితంగా వినియోగించాలని, భూగర్భ జలవనరులపై ఎక్కువగా ఆధారపడవద్దని హితవు పలికారు. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఇప్పటికే ఎఫ్‌ఎఫ్ఎస్ యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు కొనసాగుతుండగా.. మిగిలిన 10 జిల్లాల్లో బుధవారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఎఫ్‌ఎఫ్ఎస్ యాప్ ద్వారా 59.78 లక్షల బస్తాల యూరియా బుకింగ్ కాగా, 41.68 లక్షల బస్తాలను రైతులు కొనుగోలు చేశారని తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ ద్వారా ఇప్పటివరకు 33.97 లక్షల మంది రైతులు 141.93 లక్షల బస్తాలను బుకింగ్ చేసుకోగా, 128.93 లక్షల బస్తాల కొనుగోలు జరిగిందని అధికారులు వివరించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 1 Sept 2026 | 10:15 PM IST
Tags: