షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం అర్హులైన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అత్యంత ఘనంగా పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి లబ్ధిదారులకు ఆర్థిక సహాయ తాలూకు చెక్కులను అందజేశారు.

​ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాలు, పట్టణ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులు దక్కాయి. వివరాల ప్రకారం.. ఫరూఖ్‌నగర్ టౌన్ పరిధిలో 17 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులు అందగా, షాదీ ముబారక్ కింద 4 చెక్కులు పంపిణీ చేశారు. అలాగే మదలాపూర్‌లో 1, రైకల్‌లో 1, చౌలపల్లిలో 1, కిషన్‌నగర్ గ్రామంలో 1 చొప్పున లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. పేదింటి ఆడపడుపుల పెళ్లిళ్లకు ఆర్థిక భారం కారాదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నాగయ్య, మున్సిపల్ చైర్మన్ అగునూరు బసవేశ్వర్, మాజీ మార్కెట్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మార్కెట్ డైరెక్టర్ కరుణాకర్, చెంది తిరుపతిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, పట్టణ అధ్యక్షుడు నలమోని శ్రీధర్, కౌన్సిలర్లు మురళీమోహన్ అప్పి, కళ్యాణ్ కార్ దిలీప్, ఫరూఖ్‌నగర్ మండల అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్, ముబారక్, కాంగ్రెస్ నాయకులు మంగ మధు, ఇబ్రహీం, లింగారెడ్డిగూడ అశోక్, బుడ్డ నరసింహ, రఫిక్ పటేల్, శ్రీహరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 15 Oct 2026 | 02:08 PM IST
Tags: