కడ్తాల్: గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, నీటి సంరక్షణకు తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డా. కొప్పిశెట్టి కిరణ్మయి అధికారులను ఆదేశించారు. శనివారం కడ్తాల్ మండల కేంద్రంలోని ఎంబీఏ గార్డెన్లో కందుకూర్ డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె అధికారులతో సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో వర్షాకాల పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో నీటి సంరక్షణపై క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లోని నీటి వనరులను సంరక్షించడంతో పాటు వర్షపు నీటిని ఒడిసిపట్టేలా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. 'వీబీజీరామీ' పథకం పనులు, పారిశుద్ధ్యం, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ సీహెచ్. కృష్ణారెడ్డి, డీపీవో వి. సురేష్మోహన్, డీఆర్డీఓ శ్రీలత, డీఎల్పీవో సాంబిరెడ్డి, కందుకూర్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, వీబీజీ రామ్ సిబ్బంది, ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.


