ఆమనగల్లు: మహిళలు, గర్భిణులు, బాలింతలు విధిగా పోషకాహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్ పిలుపునిచ్చారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలో 'పోషణ్ అభియాన్' కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్ మాట్లాడుతూ.. ప్రతి మహిళా పోషకాలతో కూడిన ఆహారాన్ని తమ దైనందిన జీవితంలో అలవాటు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గృహ సందర్శనకు వచ్చే అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బంది అందించే సలహాలు, సూచనలను క్రమం తప్పకుండా పాటించాలన్నారు. వారు సూచించిన పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా తల్లులు, పిల్లలు సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు. ఇంట తల్లులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం, సమాజం సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నాగిల్ల జగన్, అనుష శ్రీశైలం, మాజీ వార్డ్ మెంబర్ పూసల సత్యం, స్థానిక పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్, ఆసుపత్రి సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.


