ఆమనగల్లు: తండాలు, గ్రామాల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఆమనగల్లు మండలం విట్టాయిపల్లి గ్రామ పరిధిలోని తండాలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి పనులను అధికారికంగా ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తండావాసుల రవాణా ఇబ్బందులను తొలగించేందుకు సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని, రాబోయే రోజుల్లో ప్రతి గ్రామాన్ని, తండాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, తండావాసులు పాల్గొన్నారు.


