సిద్దిపేట: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతు బీమా ద్వారా లక్షా 28 వేల కుటుంబాలకు ఆర్థిక భరోసా దక్కిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిలిపివేశారని స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం సిద్దిపేటలో రైతు బీమా అందని బాధిత కుటుంబాలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకుని, ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. రైతు బీమా పథకం ఎంతో చక్కగా అమలవుతోందని, దీనిని కొనసాగించాలని తాను పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మూడు వేల మంది రైతులు మృతి చెందగా, ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సిద్దిపేట నియోజకవర్గంలోనే 22 కుటుంబాలు రైతు బీమా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు.
మూడు నెలల నుంచి రైతు బీమా నిలిచిపోయిందని, ఆ విషయం సీఎంకు తెలుసా లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్కు మంచి పేరు వస్తుందనా? లేక రైతులపై ప్రేమ లేక ఈ పథకాన్ని బంద్ చేశారని నిలదీశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ఎల్ఐసీలో ప్రీమియం కట్టి పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధిత కుటుంబాలతో కలిసి సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యుత్ కోతలపై మాట్లాడుతూ.. 24 గంటల కరెంట్ పోయి ఇప్పుడు ఐదారు గంటలు కూడా రావడం లేదని, దీనికి అధికారులను సస్పెండ్ చేస్తామంటే ఎలా అని సీఎంను నిలదీశారు.


