లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కిన రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో) డాక్టర్ స్వర్ణకుమారిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సీజ్ చేసిన ఫిజియోథెరపీ కేంద్రాన్ని తిరిగి తెరిచేందుకు తన కారు డ్రైవర్ ద్వారా భారీగా నగదు డిమాండ్ చేసిన వ్యవహారంలో ఏసీబీ అధికారులు ఆమెను వలపన్ని పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి స్వర్ణకుమారితోపాటు మరో ఇద్దరికి కోర్టు రిమాండ్ విధించగా, వారిని చంచల్గూడ జైలుకు తరలించారు.
దీంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖాధికారులు డీఎంహెచ్వో స్వర్ణకుమారిపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది. కాగా, ప్రస్తుతం ఏసీబీ కేసులో చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న స్వర్ణకుమారి గతంలో అదే జైలులో వైద్యురాలిగా విధులు నిర్వర్తించడం గమనార్హం. ఆమె 2005 నుంచి 2013 వరకు జైళ్ల శాఖ శిక్షణ సంస్థలో వైద్యురాలిగా పనిచేశారు. ఈ కాలంలోనే కొన్ని రోజులపాటు డిప్యూటేషన్పై చంచల్గూడ జైలులోనూ సేవలందించారు. నేడు అదే జైలుకు ఆమె ఖైదీగా వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశమైంది.


