హైదరాబాద్: నగరంలో ప్రజలకు మరింత మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేలా మెట్రో, ఆర్టీసీ సేవలను అనుసంధానించే 'కామన్ పాస్'ను అధికారికంగా అందుబాటులోకి తెచ్చారు. శుక్రవారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ మెట్రో - ఆర్టీసీ కామన్ పాస్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్, వివేక్ తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మొత్తం 15 మంది మంత్రుల తరఫున సొంత డబ్బులు చెల్లించి మరీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వన్ డే ఆర్టీసీ - మెట్రో కామన్ పాస్‌ను కొనుగోలు చేయడం విశేషం. శనివారం ఉదయం 10 గంటలకు బేగంపేట నుంచి ఈ కామన్ పాస్ ద్వారా మంత్రులంతా మెట్రోలో ప్రయాణం చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. నగరంలో ప్రస్తుతం రూ. 52,000 కోట్ల పనులు జరుగుతుండగా, ఫేజ్-2 లో భాగంగా రూ. 38,000 కోట్ల మెట్రో పనులు చేపడుతున్నామని వెల్లడించారు. రూ. 30,627 కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు, 21 రేడియల్ రోడ్లు, మూసీ పునర్నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. 30 వేల ఎకరాల్లో 'భారత్ ఫ్యూచర్ సిటీ'ని అభివృద్ధి చేస్తూ, హైదరాబాద్‌ను ప్రపంచంలోనే మోస్ట్ లివబుల్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు.
ప్రజా రవాణా బలోపతమే లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఆటో డ్రైవర్లను కూడా ప్రజా రవాణా వ్యవస్థలో భాగస్వామ్యం చేస్తున్నామని, ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుతో పాటు 12 ఏళ్లుగా పెరగని ఆటో ఛార్జీల పెంపుపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రయాణికులకు సులభమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే ప్రభుత్వ ధ్యేయమని పొన్నం పేర్కొన్నారు.


