హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌కు సంబంధించి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 30లోగా సెంట్రల్ కిచెన్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని, డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సెంట్రల్ కిచెన్లను ప్రారంభించాలని ఆయన స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో శుక్రవారం హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అల్పాహార పథకం కోసం హరే కృష్ణ ఫౌండేషన్‌తో జున్నా సోలార్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, చైన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లలో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు ఈ సంస్థలు ఆర్థిక సహకారం అందిస్తున్నాయి. ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్‌లో కిచెన్ ఏర్పాటు కోసం రూ. 5.17 కోట్ల చెక్కును సీఎం చేతుల మీదుగా హరే కృష్ణ ఫౌండేషన్‌కు జున్నా సోలార్ సిస్టమ్స్ సీఎండీ శేఖర్ రెడ్డి, సీఈవో అనిల్ బాబు అందజేశారు. అలాగే, వికారాబాద్‌లో కిచెన్ నిర్మాణం కోసం రూ. 4 కోట్ల చెక్కును చైన్ ల్యాబ్స్ ప్రతినిధులు సమంత డే, వైస్ ప్రెసిడెంట్ బుగత సంతోష్ కుమార్ అందజేశారు. నిధులు అందించిన పారిశ్రామికవేత్తలను సీఎం అభినందించారు.
విద్యార్థుల ట్రాక్ రికార్డు నిర్వహించాలి..
ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ట్రాక్ రికార్డును నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల శారీరక పెరుగుదల, విద్యా పురోగతి వంటి అంశాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలని, ఆహారంలో ఇచ్చే పదార్థాల క్యాలరీలను లెక్కించడానికి ప్రత్యేక యాప్‌లను ఉపయోగించాలని తెలిపారు. బ్రేక్‌ఫాస్ట్ వల్ల విద్యార్థులు సమయానికి బడులకు చేరుకుంటారని పేర్కొన్నారు.
ఆహార నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యంత జాగ్రత్తలు పాటించాలని, ప్రాంతాల వారీగా అక్కడి స్థానిక అలవాట్లకు అనుగుణంగా అల్పాహారం తయారు చేయాలన్నారు. సెంట్రల్ కిచెన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తామని, విద్యార్థులు నేరుగా సెంట్రల్ కిచెన్లను సందర్శించేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, హరే కృష్ణ ప్రతినిధి సత్య గౌర చంద్ర దాస్ స్వామీజీ తదితరులు పాల్గొన్నారు.


