హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘించి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా కేవలం రెండు రోజుల్లోనే నగరవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా 129 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పట్టుబడిన మొత్తం 129 మందిలో అత్యధికంగా 101 మంది ద్విచక్ర వాహనదారులు కాగా, 10 మంది ఆటో డ్రైవర్లు, 18 మంది కారు, ఇతర వాహనాల డ్రైవర్లు ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. వీరిలో ముగ్గురు వాహనదారులకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్లో బీఏసీ (BAC) పాయింట్లు ఏకంగా 300కు పైగా నమోదవడం గమసార్హం.
మద్యం తాగి వాహనాలు నడపవద్దని, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు నిబంధనలను బేఖాతరు చేస్తూ రోడ్డెక్కుతున్నారని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమారాల నివారణకు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని, మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు గట్టిగా హెచ్చరించారు.


