హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భూముల రీ-సర్వే’ కార్యక్రమానికి ప్రజలందరూ సంపూర్ణంగా సహకరించాలని రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా దళితుల భూములలో అంగుళం భూమిని కూడా ప్రభుత్వం లాక్కోదని, కొందరు కావాలనే చేస్తున్న రెచ్చగొట్టే విష ప్రచారాలను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. ప్రజల భూములను తీసుకునే ఆలోచన ప్రభుత్వానికి లేనేలేదని తేల్చిచెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ సమగ్ర రీ-సర్వే కార్యక్రమం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలను మంత్రి పొంగులేటి వివరించారు. ఆధునిక టెక్నాలజీ సహాయంతో డిజిటల్ సర్వే నిర్వహించి భూ విస్తీర్ణాన్ని కచ్చితంగా నమోదు చేయడం, తద్వారా దశాబ్దాలుగా ఉన్న భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడం దీని ప్రధాన లక్ష్యమన్నారు. అలాగే భూ ఆక్రమణలపై విచారణ జరిపి ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించడం, ధరణి పోర్టల్లోని లోపాలను సవరించడం, నిషేధిత భూముల జాబితాలో చేర్చిన ప్రైవేట్ భూముల వ్యవహారంలో వాస్తవాలు తేల్చడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి భూమికీ ఒక ప్రత్యేక ఐడీ నెంబరును కేటాయించడం, ముఖ్యంగా దళిత, గిరిజన భూములను సర్వే చేసి వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రయోజనాలు సజావుగా అందేలా చర్యలు తీసుకోవడానికే ఈ కార్యక్రమం రూపొందించినట్లు పేర్కొన్నారు.
ఇప్పటికే నారాయణపురం, నూతనకల్, మద్దిరాలలోని 15 రెవెన్యూ గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్గా సర్వే నిర్వహించి, అక్కడ ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూ సమస్యలకు విజయవంతంగా పరిష్కారం చూపించామని మంత్రి పొంగులేటి గుర్తుచేశారు. అయితే కొందరు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. భూముల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్య పూర్తిగా చట్టబద్ధంగా, అత్యంత పారదర్శకంగా ఉంటుందని మంత్రి భరోసా కల్పించారు.


