గన్నేరువరం: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలానికి మంజూరైన మహాత్మా జ్యోతిబా ఫూలే (ఎంజేపీ) గురుకుల పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించే కుట్రలను వెంటనే ఉపసంహరించుకోవాలని స్థానిక యువజన సంఘాల నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి గట్టిగా డిమాండ్ చేశారు. గన్నేరువరానికి అధికారికంగా సాంక్షన్ అయిన ఈ పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తన స్వగ్రామమైన మానకొండూరు మండలం వచ్చునూరుకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది స్థానిక విద్యార్థులకు చేస్తున్న తీవ్రమైన ద్రోహమని వారు హెచ్చరించారు.

ఆదివారం గన్నేరువరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివిధ యువజన సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. వెనుకబడిన గన్నేరువరం ప్రాంత విద్యార్థుల విద్యా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మంజూరైన పాఠశాలను.. ప్రజాప్రతినిధి తన స్వగ్రామ ప్రాధాన్యత కోసం తరలించాలని చూడటం ఎంతమాత్రం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

గన్నేరువరం విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరమయ్యేలా పాఠశాలను తరలిస్తే తాము చూస్తూ ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎంజేపీ పాఠశాల తరలింపు ఆలోచనను విరమించుకోవాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో మండలవ్యాప్తంగా ఉన్న యువజన, విద్యార్థి సంఘాలు, ప్రజలందరినీ కలుపుకుని పెద్దఎత్తున ప్రత్యక్ష ఆందోళనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ విలేకరుల సమావేశంలో మరియు నిరసన కార్యక్రమంలో పలు యువజన సంఘాల నాయకులు కాల్వ నాగరాజు, కుర్ర హరీష్, గంట గౌతమ్, తిప్పర్తి ప్రవీణ్, రంగనవేని శ్రీనివాస్, బోయిని కుమార్, బోయిని మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 4 Oct 2026 | 06:29 PM IST
Tags: