అమరావతి: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీనామా చేయాలని, ‘సర్’ (SIR) ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలపై మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. అత్యున్నత రాజ్యాంగబద్ధ సంస్థను రాజకీయాలతో ముడిపెట్టడం, వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. నిరాధార ఆరోపణలతో సీఈసీ, ప్రధానమంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్లు ఏమాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు. ఓట్లు మూకుమ్మడిగా తొలగించారనేది కేవలం అపోహ మాత్రమేనని, గెలిస్తే తమ ఘనత అని.. ఓడిపోతే ఈవీఎంలను, ఎన్నికల సంఘాన్ని నిందించడం హాస్యాస్పదమని వెంకయ్య నాయుడు ఎద్దేవా చేశారు.

ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశాన్ని, ఇక్కడి వ్యవస్థలను కించపరిచే ప్రయత్నం చేయొద్దని ఆయన హితవు పలికారు. ఇప్పటికే కొన్ని పాశ్చాత్య దేశాలు భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నాయని, అలాంటి తరుణంలో మన దేశ వ్యవస్థలను మనమే అవహేళన చేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు. సీఈసీ నియామకంలో ప్రధానన్యాయమూర్తి (సీజేఐ) ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ (AI) ద్వారా ఓట్లను తొలగిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని, అసలు ఏఐని ఉపయోగించడం లేదని స్పష్టం చేశారు. భారతదేశం దివాళా తీసిందని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆరోపించడం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని చెప్పారు. అయితే, భారత్ ప్రపంచంలోకెల్లా అతి వేగంగా ముందుకు వెళ్తున్న ఆర్థిక వ్యవస్థ అంటూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) ప్రకటించిందని గుర్తుచేశారు. ఈ ఆర్థిక ప్రగతి కేవలం ప్రధాని మోదీది మాత్రమే కాదని, దేశ ప్రజలందరిదని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 10 Oct 2026 | 02:59 PM IST
Tags: