ఎల్బీనగర్: దేశంలో ప్రతిపక్షాల గొంతును నొక్కుతూ, ఓటర్ల జాబితా నుంచి అర్హులైన పేద, మధ్యతరగతి ఓటర్ల పేర్లను అనైతికంగా తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీ తరహా పరిస్థితులను సృష్టిస్తోందని ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటు హక్కు సంరక్షణ, ఓటర్ల జాబితాలో అక్రమాలపై వ్యక్తమవుతున్న ఆందోళనలకు మద్దతుగా ఆయన ఆధ్వర్యంలో ఎల్బీనగర్ చౌరస్తాలో శనివారం భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. గతం లో జరిగిన ఎన్నికలలోనూ అనుమానాలు వ్యక్తమయ్యాయని, కృత్రిమ మేధ (AI) సాంకేతికతను ఉపయోగించి ప్రతిపక్షాల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగిస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాత వైఖరి పాటించాలని స్పష్టం చేశారు. అలాగే, శాంతియుతంగా నిరసన తెలిపే విద్యార్థులను, యువతను రైళ్లు, మెట్రో స్టేషన్లు నిలిపివేసి భోపాల్ తదితర ప్రాంతాల్లో అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. శాంతియుత ప్రజాస్వామ్య నిరసనలను పోలీసుల బలంతో అణచివేయడం సరికాదన్నారు.
1975 నాటి కాంగ్రెస్ ఎమర్జెన్సీ చీకటి రోజులను ప్రస్తుత పరిణామాలు గుర్తుచేస్తున్నాయని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం నిలపాలంటే ఓటర్ల జాబితా అక్రమాలపై సమాధానం చెప్పాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, శాంతియుత నిరసన తెలిపే హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ ధర్నాలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, మహిళలు పాల్గొన్నారు.


