విజయవాడ: నగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మంగళవారం (అక్టోబర్ 13) విజయవాడకు రానున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దసరా నవరాత్రి వేడుకలు, విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమాలకు హాజరుకావాలని ఇటీవల చెన్నైలో ఏపీ టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జీఎం హరీశ్ బాలయోగి ఆయనను కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడు సీఎం పర్యటన షెడ్యూల్ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) అధికారికంగా విడుదల చేసింది. సోమవారం తమిళనాడు సీఎం భద్రతా సిబ్బంది ఇంద్రకీలాద్రికి చేరుకుని భద్రతా ఏర్పాట్లను, రూట్ మ్యాప్ను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ పర్యటన షెడ్యూల్ ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 3:00 గంటలకు చెన్నై విమానాశ్రయం నుంచి బయలుదేరి సాయంత్రం 4:00 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ప్రముఖుల స్వాగత సత్కారాల అనంతరం రోడ్డు మార్గాన ఇంద్రకీలాద్రికి చేరుకుని, సాయంత్రం 5:00 నుంచి 5:45 గంటల వరకు దుర్గమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 5:45 గంటలకు ఆలయం నుంచి బయలుదేరి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకుంటారు.
సాయంత్రం 6:00 నుంచి 7:00 గంటల వరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా సమావేశమై గోదావరి - కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టు, కృష్ణా నీటి విడుదల తదితర కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ చర్చల్లో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొంటారు. అనంతరం రాత్రి 7:10 గంటలకు పున్నమి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన 'విజయవాడ ఉత్సవ్ 2.0' వేడుకలకు సీఎం విజయ్ హాజరవుతారు. ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం రాత్రి 9:00 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి చెన్నైకి తిరుగుపయనమవుతారు.


