మహేశ్వరం: జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన భద్రత, వారి ప్రాథమిక హక్కుల సాధన కోసం ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతామని తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం (టీఎంజేఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షులు వత్తుల రఘుపతి స్పష్టం చేశారు. టీఎంజేఎఫ్‌‌ రాష్ట్ర అధ్యక్షులుగా ఇటీవల నియమితులైన ఆయన తొలిసారిగా మహేశ్వరం మండలానికి విచ్చేయగా.. మండల కేంద్రంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వత్తుల రఘుపతి మాట్లాడుతూ.. తనను అభినందించిన మహేశ్వరం మండల మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తూ నిత్యం ప్రజా సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తీసుకువస్తున్నారని కొనియాడారు. అలాంటి జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో జర్నలిస్టులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు, సంక్షేమ పథకాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. జర్నలిస్టుల సమస్యలను సంబంధిత ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని, ఒకవేళ అవసరమైతే జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ప్రభుత్వంతో పోరాడడానికైనా వెనుకాడబోమని తేల్చిచెప్పారు. జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కుల పరిరక్షణ కోసం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మహేశ్వరం మండలానికి చెందిన పలువురు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొని వత్తుల రఘుపతిని సత్కరించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 3 Oct 2026 | 07:18 PM IST
Tags: