కడ్తాల్: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జాతీయ జనగణనలో ఓబీసీ కులాల గణన చేపట్టాలనే ప్రధాన డిమాండ్‌తో ఏఐసీసీ పిలుపుమేరకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం, షాద్‌నగర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఓబీసీ విభాగం అధ్యక్షులు వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో అక్టోబర్ 4న శంషాబాద్‌లోని గొల్లపల్లి రోడ్డులో 'ఓబీసీ సింహ గర్జన' భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభను విజయవంతం చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు.

ఈ మేరకు సభ ఏర్పాట్లపై కడ్తాల్‌లో టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నరసింహ ముదిరాజ్, డీసీసీ ఉపాధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి చేగురి వెంకటేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, రాష్ట్ర విభజన సేవా సంఘం అధ్యక్షులు హనుమాన్ నాయక్ తదితరులతో కలిసి ఆయన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. బీసీలకు జనాభా ప్రాతిపదికన న్యాయమైన వాటా, హక్కులు కల్పించేందుకు ఓబీసీ కులగణన ఎంతో కీలకమని స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధన కోసం నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఓబీసీ కులగణన ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, బీసీల హక్కుల సాధనకు అంతా సంఘీభావం తెలపాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో కడ్తాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోతుగంటి శంకర్, సర్పంచ్ భిక్షపతి, కంబాలపల్లి రామకృష్ణ, మాల మల్లేష్ గౌడ్, బల్రాజ్, జగన్ గౌడ్, శేఖర్ గౌడ్, రామచంద్రనాయక్, అశోక్ జాంగిర్, బాబా తదితరులు పాల్గొని సభను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 3 Oct 2026 | 06:46 PM IST
Tags: