హైదరాబాద్: మెట్రో రైల్, ఆర్టీసీ బస్సుల కోసం ప్రతిష్టాత్మకమైన కామన్ ట్రావెల్ పాస్‌ను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నుంచి అధికారికంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కామన్ పాసుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక పోస్ట్ పెట్టారు. హైదరాబాద్‌లో నేటి నుంచి సరికొత్త ట్రాన్స్పోర్ట్ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని, అన్ని మెట్రో స్టేషన్లలో ఈ ఉమ్మడి పాస్‌లను జారీ చేస్తున్నట్లు వివరించారు.
ORR (ఔటర్ రింగ్ రోడ్డు) పరిధిలోని సిటీ బస్సుల్లో ఈ కామన్ పాస్ పూర్తిగా చెల్లుబాటవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఈ విధానం ద్వారా బస్సు, మెట్రో ప్రయాణానికి ఇకపై రెండో టికెట్ అవసరం ఉండదని స్పష్టం చేశారు. ఈ సరికొత్త సదుపాయం ద్వారా సుమారు 25 లక్షలకు పైగా బస్సు ప్రయాణికులతో పాటు 4.5 లక్షల మెట్రో ప్రయాణికులకు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. మెరుగైన లాస్ట్‌మైల్ కనెక్టివిటీపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రజా రవాణాను పూర్తిగా ఏకీకృతం చేసే దిశగా ఇది కీలక అడుగు అని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను దేశంలోని 'ఫాస్టెస్ట్ సిటీస్'లో ఒకటిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు.
పాస్ ధరలు, ప్రత్యేక సదుపాయాలు..
ఆర్టీసీ బస్ - మెట్రో రైల్ సంయుక్తంగా రోజువారీ, నెలవారీ పాస్‌లను సర్కార్ జారీ చేసింది.
రోజువారీ పాస్ (Day Pass): రూ. 400
నెలవారీ పాస్ (Monthly Pass): రూ. 8,500
అలాగే, ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. కండక్టర్‌తో పని లేకుండా 'మీ టికెట్' (Me Ticket) యాప్ ద్వారా మొబైల్లోనే రోజువారీ టికెట్లు, డే పాస్‌లు, వారం, నెలవారీ బస్ పాస్‌లను పొందే సదుపాయాన్ని కల్పించినట్లు అధికారులు తెలిపారు.


