హైదరాబాద్: త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌లో బీఆర్ఎస్‌ తరఫున భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్‌‌చాట్ నిర్వహిస్తూ రాజకీయ పరిణామాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించవచ్చని, అయితే సిరిసిల్లలో బలప్రదర్శన చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సిరిసిల్ల ఏమైనా పక్క రాష్ట్రంలో ఉందా అని ఎద్దేవా చేశారు. సీఎం సిద్దిపేటలో కూడా సభ పెడతానని అంటున్నారని, ఆ సభ పూర్తయిన వెంటనే తాము కొడంగల్‌లో బీఆర్ఎస్ సభను నిర్వహిస్తామని, ఆ సభతో ముఖ్యమంత్రికి చెమటలు పడతాయని హెచ్చరించారు. సిరిసిల్లలో సభ ద్వారా రేవంత్‌కు వచ్చిన మైలేజ్ కంటే నష్టమే ఎక్కువ జరిగిందని అభిప్రాయపడ్డారు.

ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్ విజయం ఖాయం..

ఖైరతాబాద్ బైపోల్స్‌లో వంద శాతం బీఆర్ఎస్ అభ్యర్థే గెలుపొందుతుందని తలసాని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారిన దానం నాగేందర్‌పై ఖైరతాబాద్ ఓటర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. గతంలో ఓటు హక్కు వినియోగించుకోని వారు సైతం ఈ బైపోల్స్‌‌లో కసితో బీఆర్ఎస్‌కు ఓటు వేస్తారన్నారు. జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ ఉపఎన్నికల పరిస్థితి వేరని, ఈసారి ఎంత డబ్బు పంచినా ఓటర్లు కాంగ్రెస్‌ వైపు చూసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో తమను సస్పెండ్ చేయడంపై స్పందిస్తూ.. "అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసేంత సీన్ మేము ఏం చేశాం? బయట జరిగిన గొడవకు స్పీకర్‌కు ఏం సంబంధం?" అని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 2 Oct 2026 | 03:17 PM IST
Tags: