షాద్‌నగర్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్క అర్హత కలిగిన ఓటు కూడా వృథా కాకుండా పక్కాగా చర్యలు చేపడుతున్నామని షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు బూత్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రక్రియను వేగవంతం చేశామని శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

1.99 లక్షల ఓట్ల మ్యాపింగ్ పూర్తి.. 80 శాతం పురోగతి

నియోజకవర్గంలోని 150 గ్రామ పంచాయతీలు, 268 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఇప్పటివరకు 1,99,311 ఓట్ల మ్యాపింగ్ పూర్తయిందని, దీంతో 80 శాతం పనులు పూర్తయినట్లేనని ఎమ్మెల్యే వివరించారు. మరో 13,923 ఓట్లు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ఫరూక్‌నగర్, జిల్లేడు చౌదరిగూడ, కేశంపేట, కొందుర్గు తదితర మండలాల్లో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ 90 శాతానికి పైగా పూర్తయిందని చెప్పారు.

రెండు చోట్ల ఓట్లు ఉంటే చట్టపరమైన చర్యలు

ఒకే వ్యక్తి రెండు వేర్వేరు చోట్ల ఓటు నమోదు చేసుకోవడం చట్టరీత్యా నేరమని ఎమ్మెల్యే హెచ్చరించారు. అలాంటి వారు స్వచ్ఛందంగా ఒకే చోట ఓటు ఉంచుకోవాలని, లేనిపక్షంలో ఎన్నికల చట్టాల ప్రకారం కఠిన చర్యలతో పాటు జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 24 Jul 2026 | 02:39 PM IST
Tags: