షాద్‌నగర్: తెలంగాణ ఆటగా, పాటగా, ప్రజా ఉద్యమాల గీతంగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు గద్దర్ అని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొనియాడారు. ప్రజాయుద్ధనౌక గద్దర్ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం షాద్‌నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దశాబ్దాల కాలంగా తన విప్లవాత్మక పాటలతో ప్రజలలో అపారమైన చైతన్యాన్ని నింపిన నిస్వార్థ ప్రజా నాయకుడు గద్దర్ అని అన్నారు. స్వరాష్ట్ర సాధన తెలంగాణ ఉద్యమంలోనూ తన పాటల ద్వారా సమరశంఖం పూరించి జనచైతన్యం తీసుకువచ్చారని గుర్తుచేశారు. నక్సలైట్‌గా ముద్రవేసి, తుపాకీ బుల్లెట్లను శరీరంలోకి దించినప్పటికీ అదరక, బెదరక చివరి శ్వాస వరకు ప్రజా ఉద్యమాలకు ఊపిరిపోస్తూ నిరంతరం జనం కోసమే జీవించారని పలికారు.

ప్రజా కళాకారుడిగా, ఉద్యమకారుడిగా ఆయన అందించిన అద్భుతమైన సేవలను గుర్తించినందుకే తెలంగాణ ప్రభుత్వం సినీ కళాకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మక రాష్ట్ర పురస్కారాలకు 'గద్దర్ అవార్డులు'గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నామకరణం చేశారని స్పష్టం చేశారు. ప్రజాపాలన అందించే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని గద్దర్ ఎంతో ఆశించారని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి ముందే ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోవడం తీరని బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా గుండెల్లో గద్దర్ పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, జేఏసీ ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 6 Aug 2026 | 01:51 PM IST
Tags: