షాద్‌నగర్: తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికై అంకితభావంతో పనిచేసిన గొప్ప ప్రజానాయకుడు, మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి తొలి జయంతి వేడుకలు షాద్‌నగర్ పట్టణంలో ఘనంగా జరిగాయి. స్థానిక బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, కేశంపేట మాజీ ఎంపీపీ వై. రవీందర్ యాదవ్ నేతృత్వంలో ఈ నివాళి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నేత వై. రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి ప్రజాసేవలోనే తన జీవితాన్ని ధారపోసిన నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ ప్రారంభ దశ నుంచే కేసీఆర్ నాయకత్వాన్ని విశ్వసించి, గులాబీ జెండా నీడన ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ బలపడటానికి అహర్నిశలు శ్రమించారని గుర్తుచేశారు. 2001లో నల్లబెల్లి జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన, పౌర సరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్‌గా సేవలు అందించి, 2018లో నర్సంపేట ఎమ్మెల్యేగా విజయం సాధించి గ్రామీణాభివృద్ధి, రైతాంగ సంక్షేమానికి విశేష కృషి చేశారని తెలిపారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశయాలను ప్రతి బిఆర్ఎస్ కార్యకర్త ముందుకు తీసుకెళ్లాలని, ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా పనిచేయాలని రవీందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాల్ నాయక్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ మార్కెట్ చైర్మన్ మన్నె కవిత నారాయణ, పార్టీ నాయకులు రాజ్యలక్ష్మి, నటరాజన్, లక్ష్మణ్ నాయక్, పలువురు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, బిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.


