హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మాజీ సైనికుల సంక్షేమం, ఉపాధి, పునరావాసానికి ప్రత్యేకంగా 'తెలంగాణ మాజీ సైనికుల కార్పొరేషన్' ఏర్పాటు చేసే అంశంపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు ఆదేశించారు. సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు బుధవారం సచివాలయంలో సీఎస్‌ను కలిసి మాజీ సైనికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, సంక్షేమానికి సంబంధించిన కీలక ప్రతిపాదనలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సమావేశంలో తెలంగాణలో మాజీ సైనికుల కార్పొరేషన్ ప్రాధాన్యతను బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు వివరించగా, ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న కార్పొరేషన్ల విధి విధానాలు, నిర్వహణ, ఆర్థిక వనరులు, అమలు తీరుపై అధ్యయనం చేసి సమగ్ర నివేదికను రూపొందించాలని సీఎస్ సూచించారు. అదేవిధంగా, ప్రభుత్వం ఆధ్వర్యంలో 'రాజ్య సైనిక బోర్డు' సమావేశాన్ని త్వరలోనే నిర్వహించాలని బ్రిగేడియర్ కోరగా, సీఎస్ సానుకూలంగా స్పందించారు. మాజీ సైనికుల సమస్యలను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
వీటితో పాటు మాజీ సైనికులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, నివాస భద్రత, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రాధాన్యత ఇవ్వడం, వీరనారులు, ఆర్థికంగా వెనుకబడిన మాజీ సైనిక కుటుంబాలకు ప్రత్యేక కోటా, ఉపాధి అవకాశాలు, పునరావాసం తదితర అంశాలను బ్రిగేడియర్ ప్రస్తావించారు. ఈ అంశాలపై సంబంధిత శాఖలతో సమన్వయం చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎస్ హామీ ఇచ్చారు. మాజీ సైనికుల సమస్యలను ఓపికగా విని సానుకూలంగా స్పందించినందుకు సీఎస్ సంజయ్ జాజుకు బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు ధన్యవాదాలు తెలిపారు.


