అమరావతి: పార్వతీపురం మన్యం జిల్లాలో మానవ-ఏనుగుల మధ్య జరుగుతున్న ఘర్షణలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి 'జయంత్', 'అభిమన్యు' అనే రెండు శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను గుచ్చిమి శిబిరానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు గజరాజులకు పూలు చల్లి సాదర స్వాగతం పలికారు.
స్వయంగా ఆహారం అందించి జెండా ఊపిన డిప్యూటీ సీఎం
ఈ సందర్భంగా జయంత్, అభిమన్యులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆహారాన్ని అందజేశారు. అనంతరం గుచ్చిమి శిబిరానికి ప్రయాణమయ్యే రెండో అంచె రవాణాను జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణ సమయంలో కుంకీల భద్రతపై అటవీ శాఖ అధికారులకు ప్రత్యేక దిశానిర్దేశం చేశారు. గుచ్చిమి శిబిరానికి చేరుకున్నాక నిపుణుల పర్యవేక్షణలో అక్కడి వాతావరణానికి అవి అలవాటు పడేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పంటల రక్షణ, శాస్త్రీయ విధానాలే కూటమి ప్రభుత్వ లక్ష్యం
ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి ఏనుగుల గుంపులు తరచూ పార్వతీపురం జిల్లాలోకి ప్రవేశించి పంటలను, ఆస్తులను నాశనం చేస్తున్నాయి. గతంలో చిత్తూరు, పలమనేరు ప్రాంతాల్లో అడవి ఏనుగుల గుంపులను సురక్షితంగా అడవుల్లోకి మళ్లించడంలో జయంత్, అభిమన్యులు కీలక పాత్ర పోషించాయి. ప్రజల భద్రత, రైతుల పంటల రక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణను కూటమి ప్రభుత్వం శాస్త్రీయ, మానవీయ కోణంలో చేపడుతోందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలిపారు.


