షాద్‌నగర్: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి వేడుకల సందర్భంగా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. షాద్‌నగర్ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న ఆచార్య జయశంకర్ విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిస్వార్ధంగా ప్రజల కోసం పనిచేస్తూ, ప్రాణాలు సైతం ఇచ్చేవారు జాతిపితలు అవుతారు తప్ప, ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ పదవులు పొంది, సొంత కుటుంబానికి పదవులు కట్టబెట్టినవారు జాతిపితలు ఎలా అవుతారని ప్రశ్నించారు. తెలంగాణ సిద్ధాంత రూపకల్పనకు, స్వరాష్ట్ర కల నెరవేరడానికి ఆచార్య జయశంకర్ చేసిన త్యాగం, చూపిన చొరవ అసాధారణమైనవని కొనియాడారు. విద్యార్థులను, యువతను ఉద్యమం వైపు నడిపించడంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకులు ఎలాంటి పదవులు ఆశించకుండా ప్రజల కోసమే ప్రాణాలర్పించారని గుర్తుచేశారు. అదేవిధంగా జయశంకర్ సార్ కూడా తన చివరి శ్వాస వరకు ఎలాంటి పదవులను ఆశించకుండా తెలంగాణ కోసం నిరాటంకంగా పోరాడారని, కాబట్టి ఆయనే తెలంగాణకు నిజమైన జాతిపిత అని స్పష్టం చేశారు. శ్రీకాంతాచారి లాంటి అమరుల త్యాగాలు, బలిదానాలను చూసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని, అయితే పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని నిలువెల్లా దోచుకుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు, జేఏసీ ప్రతినిధులు, ఉద్యమకారులు పాల్గొన్నారు.


