అమరావతి:  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. జూన్ 30 నుండి జూలై 1 వరకు ఏపీలోని పలు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటనకు సంబంధించి రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) ఇప్పటికే అధికారిక షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రపతి రాక కోసం ఇటు అధికారులు, అటు యూనివర్సిటీ వర్గాలు సర్వం సిద్ధం చేశాయి.

నేడు అంటే జూన్ 30వ తేదీన విజయనగరంలో ఏర్పాటు చేసిన కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం (Central Tribal University)  మొదటి స్నాతకోత్సవం (Convocation)  వేడుకలకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ తొలి స్నాతకోత్సవ సభలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గిరిజన ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రీయ వర్సిటీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసే ఈ కార్యక్రమం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ  కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరవుతున్నారు. వారితో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. రాష్ట్రపతి టూర్ నేపథ్యంలో విజయనగరం జిల్లా వ్యాప్తంగా భద్రత (Security) పెంచారు. ప్రొటోకాల్ ప్రకారం పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
రెండవ రోజు పర్యటనలో భాగంగా రేపు అంటే జూలై 1వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం (Central University of Andhra Pradesh ) మొదటి స్నాతకోత్సవ వేడుకలకు విచ్చేస్తున్నారు. అనంతపురం కేంద్రీయ వర్సిటీ చరిత్రలో కూడా ఇదే తొలి స్నాతకోత్సవం (Convocation) కావడంతో విద్యార్థులు, అధ్యాపకులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. రాయలసీమ ప్రాంత ఉన్నత విద్యా ప్రస్థానంలో ఈ ప్రోగ్రామ్ ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. జాతీయ స్థాయి ప్రముఖులు తరలివస్తుండటంతో ఈ రెండు కాన్వొకేషన్ వేడుకలపైనే అందరి దృష్టి నెలకొంది.

Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 10 Jul 2026 | 12:46 PM IST