విశాఖపట్నం: ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం (IBM) విశాఖపట్నంలో తన నూతన 'ఐబీఎం కన్సల్టింగ్ ఫ్యూచర్‌నౌ సెంటర్' (FutureNow Centre)ను ప్రారంభించింది. విశాఖ ఇసుకతోట జంక్షన్‌లోని లాన్సమ్ స్క్వేర్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఐబీఎం ఇండియా మరియు సౌత్ ఏసియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్‌తో కలిసి బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐ గవర్నెన్స్ ఇంటెలిజెన్స్, కెమికల్స్ అండ్ పెట్రోలియం ఇండస్ట్రీ ఆపరేషన్లకు సంబంధించిన సాంకేతిక వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఈ నూతన కేంద్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హైబ్రిడ్ క్లౌడ్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, డేటా & అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి కీలక రంగాల్లో కన్సల్టింగ్ మరియు సాంకేతిక సేవలు అందించనున్నారు. విశాఖలోని బలమైన విద్యావ్యవస్థ, సాంకేతిక ప్రతిభను వినియోగించుకుంటూ భారతదేశంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఐబీఎం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, విశాఖపట్నం ప్రపంచ స్థాయి ఏఐ మరియు డిజిటల్ సేవల కేంద్రంగా మారడానికి ఐబీఎం సెంటర్ మైలురాయిగా నిలుస్తుందన్నారు. కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, స్థానిక యువతకు నాణ్యమైన ఉపాధిని కల్పించి ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు సిద్ధం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్, ఇండియా మేనేజింగ్ పార్ట్‌నర్ ఉషా శ్రీకాంత్ మాట్లాడుతూ, వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో భాగస్వామ్యమవుతూ స్థానిక నైపుణ్యాలను గ్లోబల్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు అనుసంధానిస్తామని పేర్కొన్నారు.


