కడ్తాల్: ప్రభుత్వ వసతి గృహాలు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే ఆలయాలుగా ఉండాల్సిందిపోయి.. సమస్యలకు పుట్టినిళ్లుగా మారుతున్నాయి. అరకొర వసతులు, సవాలక్ష సమస్యలతో అస్తవ్యస్తంగా మారిన ప్రభుత్వ వసతి గృహాల దుస్థితికి రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి బాలుర వసతి గృహం ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. సరిపడా గదులు లేక, ఉన్నా శిథిలమై పెచ్చులూడే గోడలు, ఉరుస్తున్న భవనాల మధ్య విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

మైసిగండిలోని వసతి గృహాన్ని పరిశీలించగా పలు దిగ్భ్రాంతికర సమస్యలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా మరుగుదొడ్లు, స్నానగదులు లేకపోగా.. అసలు శౌచాలయాల సదుపాయమే కరవైంది. పాఠశాల చుట్టూ పిచ్చిమొక్కలు, గడ్డి పెరిగి అపరిశుభ్రంగా తయారైనప్పటికీ, సిబ్బంది కనీసం గడ్డి మందు కూడా కొట్టడం లేదు. విపరీతంగా పెరిగిన చెత్తాచెదారం, పిచ్చి మొక్కల వల్ల దోమలు స్వైరవిహారం చేస్తుండటంతో విద్యార్థులు తరచూ జ్వరాల బారిన పడుతున్నారు.

ఒకే బెడ్‌పై ఇద్దరు.. పట్టించుకోని వార్డెన్..

హాస్టల్‌లో బెడ్లు సరిపోక ఒకే బెడ్‌పై ఇద్దరేసి విద్యార్థులు సర్దుకుని పడుకోవాల్సి వస్తోంది. ఉన్న బెడ్లు సైతం శిథిలమై, ఎక్కడికక్కడ ఇనుప చువ్వలు తేలి విరిగిపోయి ఉన్నాయి. మైసిగండి సమీపంలోని వసతి గృహం ముందున్న షెడ్లలో భక్తులు ఫంక్షన్లు నిర్వహించడం వల్ల వచ్చే దుర్వాసనతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వ్యాధుల బారిన పడుతున్నారు. మరోవైపు, కిటికీలు, గదులకు కనీసం దోమతెరలు (మెష్‌‌) లేకపోవడం, ఫ్యాన్లు సరిగ్గా తిరగకపోవడంతో ఉక్కబోత, దోమలతో విద్యార్థులు నరకం అనుభవిస్తున్నారు.

inline-img

పిల్లలు అనారోగ్యాల పాలవుతున్నా సంబంధిత వార్డెన్ మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంట సామాను గదులలో ఎలుకలు తిరుగుతూ ఆహార భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. విద్యాబోధన చేయడంతోపాటు ఆ గదుల్లోనే నిద్రించాల్సి వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, జిల్లా యంత్రాంగం స్పందించి వసతి గృహాల్లోని సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 3 Oct 2026 | 03:20 PM IST
Tags: