హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బస్ స్టాప్ పక్కన ఉన్న సంతోషిమాత మందిరంలోకి మహమ్మద్ అన్సారీ అనే వ్యక్తి చొరబడి దాడి చేసినట్లు వచ్చిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు.
మీ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు ఇలాగే కొనసాగుతూనే ఉండాలా? అంటూ నిలదీశారు. హిందూ దేవాలయాలకు, భక్తులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో హిందూ దేవాలయాల భద్రతకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని నిలదీశారు. దేవాలయంలోకి చొరబడి దాడి చేసిన ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించి, నిందితుడు దోషిగా తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
"రేవంత్ రెడ్డి గారూ, హిందువుల ఆరాధనా స్థలాలకు రక్షణ కల్పించడం మీ ప్రభుత్వ బాధ్యత కాదా? హిందూ సమాజానికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఇంకా ఎంతకాలం నిర్లక్ష్యం వహిస్తుంది?" అని రాజా సింగ్ మండిపడ్డారు. తెలంగాణలో ప్రతి దేవాలయానికి, ప్రతి భక్తుడికి రక్షణ ఉండాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.


