హైదరాబాద్: దిల్సుఖ్నగర్ పరిధిలోని సంతోషిమాత ఆలయంలో అమ్మవారి విగ్రహంపై మహమ్మద్ అన్సారీ అనే వ్యక్తి మతపరమైన నినాదాలు చేస్తూ దాడి చేసి ధ్వంసం చేయడాన్ని హిందూ సంఘాల నాయకులు, భక్తులు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ ఆలయాలు, దేవుళ్ల విగ్రహాలపై వరుస దాడులు జరుగుతున్నప్పటికీ.. ప్రభుత్వం ఎలాంటి స్పందన చూపకుండా కేవలం ఒక వర్గం ఓట్ల కోసం నిశ్శబ్దంగా ఉండడం అత్యంత దారుణమని మండిపడ్డారు.
ఇలాంటి ఘటనల పట్ల ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి, పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతాయని, భవిష్యత్లో జరిగే పరిణామాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు. ఆలయాల వద్ద భద్రతను కల్పించడంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.


