మహేశ్వరం: మండల పరిధిలోని గాంధీనగర్ తండాలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తండాలో మహాత్మా గాంధీ చిత్రపటానికి గ్రామస్తులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ పోషించిన పాత్ర అత్యంత చిరస్మరణీయమని కొనియాడారు. సత్యం, అహింస, శాంతి మార్గాలను తమ ఆయుధాలుగా చేసుకుని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసిన మహనీయుడు గాంధీజీ అని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన త్యాగాలు, ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు చేపట్టిన కృషి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ఆచరించాలని సూచించారు. గ్రామంలో పరిశుభ్రత, ఐక్యత, సోదరభావం పెంపొందించుకోవడంతో పాటు సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాంధీజీ ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సభావత్ మంజుల చత్రు నాయక్, 2వ వార్డు సభ్యురాలు నేనావత్ కమలమ్మ రాములు, 6వ వార్డు సభ్యురాలు సభావత్ శాంతి, మాజీ డిప్యూటీ సర్పంచ్ పాల్త్య మోహన్ నాయక్, గ్రామ యువకులు, తండా పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.


