హైదరాబాద్: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే తాము ఫార్ములా ఈ రేస్ నిర్వహించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే ఇందులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తమపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా తప్పుడు కేసులు పెట్టారని ఆయన తీవ్రంగా ఆరోపించారు.
శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టు వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఈ అక్రమ కేసులకు తాను ఏమాత్రం భయపడేది లేదని, న్యాయవ్యవస్థపై తనకు అపారమైన నమ్మకం ఉందని తెలిపారు. పోలీసులు ఎంత వేధించినప్పటికీ ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయవ్యవస్థ తమకు వెన్నుదన్నుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ నిమిత్తం ఎప్పుడు పిలిచినా తాను రావడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
పక్క రాష్ట్రాలు తమ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తుంటే, ఇక్కడ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులను అడ్డుకుంటూ తప్పుడు కేసులు పెడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. కేవలం టార్గెట్ కేసీఆర్ అనే అజెండాతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. తాము లక్ష కోట్లు సంపాదించామంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న అసత్య ఆరోపణలపై ఆయన సవాల్ విసిరారు.
‘రూ. 1000 కోట్లు ఇచ్చి మా పేరుపై ఉన్న లక్ష కోట్ల ఆస్తులు తీసుకోమని ప్రభుత్వానికి సూచిస్తున్నాం. మిగిలిన రూ. 99 వేల కోట్లతో మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చండి’ అంటూ కేటీఆర్ ప్రభుత్వాని డిమాండ్ చేశారు.


