షాద్నగర్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ఇండియన్ హైట్స్ ప్రైవేట్ పాఠశాలలో నాలుగో తరగతి అభ్యసిస్తున్న విద్యార్థిని వర్ణిక ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి కిందపడి మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా, పాఠశాల వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
పాఠశాల వేళల్లో తోటి విద్యార్థులతో కలిసి మెట్లు దిగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెనుక నుంచి ఇతర విద్యార్థులు రావడంతో బ్యాలెన్స్ తప్పిందా లేదా కాలు జారి కిందపడిందా అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మెట్లపై నుంచి పడిన వెంటనే విద్యార్థిని అపస్మారక స్థితికి చేరుకోవడంతో, అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బాలిక తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు కన్నీటిపర్యూమంగా తెలిపారు.
ఆడుతూ పాడుతూ కళ్లముందు తిరిగే చిన్నారి ఇలా అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోవడం తోటి విద్యార్థులను, ఉపాధ్యాయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. విద్యార్థిని మృతితో పాఠశాలలో, కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


