హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్‌గా నియమించారంటూ సోషల్ మీడియాలో గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయనను అభినందిస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టర్లు షేర్ చేస్తూ కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే వాస్తవంగా అలాంటిదేమీ జరగలేదని, ఇదంతా కేవలం సోషల్ మీడియా సృష్టేనని అధికారిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

​ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న కిరణ్‌ కుమార్ రెడ్డిని తమిళనాడు గవర్నర్‌గా నియమించారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రితో ఆయనకు ఉన్న సంబంధాల నేపథ్యంలో ఆయన్ని ఎన్డీఏలోకి తీసుకొచ్చే వ్యూహంలో భాగంగానే కేంద్రం పంపించిందంటూ ప్రచారంలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఏ రాష్ట్రానికైనా కొత్త గవర్నర్‌లను రాష్ట్రపతి మాత్రమే నియమిస్తారని, దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక ఆదేశాలు లేదా ప్రకటన రాలేదు. దీంతో ప్రస్తుతం జరుగుతున్నదంతా కేవలం పుకార్లు మాత్రమేనని తేలింది.

​మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డి వర్గం కూడా ఈ ప్రచారంపై స్పందించడం లేదు. ప్రస్తుతం ఆయన యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. మారుతున్న రాజకీయ సమీకరణాల కారణంగా కొన్ని రాష్ట్రాల గవర్నర్‌లను మార్చే అవకాశం ఉందంటూ కొన్ని మీడియా సంస్థలు గతంలో వార్తలు ప్రచారం చేయగా, అందులో కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఆయనకు గవర్నర్ పదవి ఖాయమైందంటూ ప్రచారం ఊపందుకుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్ ఉన్న నేత కావడంతో భవిష్యత్‌లో ఆయనకు తగిన గుర్తింపు లభించవచ్చనే అంచనాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతానికైతే ఆయనకు గవర్నర్ పదవి దక్కినట్లు ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 29 Aug 2026 | 03:19 PM IST
Tags: