హైదరాబాద్: పిల్లలు ఆన్‌‌లైన్ వేధింపులు, సైబర్ నేరాల బారిన పడకుండా వారి భద్రత, సంరక్షణ కోసం న్యాయ సేవల ప్రాధికార సంస్థ (TGLSA) సూచనలు, కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిజిటల్ వేదికలపై పిల్లల రక్షణ కోసం వ్యవస్థలను బలోపేతం చేయడానికి న్యాయసేవల సంస్థలు చేపడుతున్న మంచి కార్యక్రమాలను ప్రతి గ్రామానికి చేరేలా ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని ఆయన తెలిపారు.

జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ (NALSA) ఆధ్వర్యంలో “డిజిటల్ వేదికలపై పిల్లలకు రక్షణ, సులభంగా న్యాయం అందించడం: ఆన్‌లైన్ లైంగిక వేధింపులను అరికట్టడం, పిల్లలకు అనుకూలమైన న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం” అనే ఇతివృత్తంతో హైదరాబాద్‌లో దక్షిణాది ప్రాంతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, NALSA ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ విక్రమ్ నాథ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ అలోక్ అరాధే, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, TGSLSA ప్యాట్రన్-ఇన్-చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తదితరులు విచ్చేశారు.

మహిళలు, పిల్లల రక్షణే మా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలు, పిల్లల రక్షణ కోసం అత్యున్నత ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. భరోసా కేంద్రాల ద్వారా ఒకేచోట పోలీసు, వైద్య, న్యాయ సహాయం అందిస్తున్నామని, దేశంలోనే తొలి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో 'CybHER' యాప్‌ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, విద్యార్థులనే సైబర్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.

సైబర్ నేరాల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098 గురించి తల్లిదండ్రులు, పిల్లలు తప్పక అవగాహన కలిగి ఉండాలని కోరారు. "న్యాయం అంటే కేవలం నేరస్తుడికి శిక్ష పడటం కాదు.. బాధితుడి జీవితాన్ని తిరిగి నిలబెట్టడం, ముఖ్యంగా పిల్లలు కోల్పోయిన బాల్యాన్ని తిరిగి అందించడమే నిజమైన న్యాయం" అని సీఎం ఉద్ఘాటించారు.

కార్యక్రమంలో భాగంగా ఉచిత న్యాయ సేవల కోసం సిద్ధం చేసిన సంచార లోక్ అదాలత్ (Mobile Lok Adalat) వాహనాలను కేంద్ర మంత్రి, న్యాయమూర్తుల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 3 Oct 2026 | 02:17 PM IST
Tags: