జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో ఈసారి కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కొనుగోళ్ల అవసరం తగ్గే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా పత్తి సాగు గణనీయంగా తగ్గింది. దీనివల్ల దేశవ్యాప్తంగా పత్తికి డిమాండ్ భారీగా పెరిగింది. ఇప్పటికే ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కొత్తపత్తి రాక ప్రారంభంకాగా, గరిష్ట ధర రూ. 9,200, మోడల్ ధర రూ. 9,100 వరకు నమోదైంది.

మద్దతు ధరకు మించి ధరలు

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2026-27 సీజన్ మద్దతు ధర రూ. 8,667 కాగా, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో గురువారం నాడే రూ. 8,700 ధర పలికింది. ఈ సీజన్‌లో మద్దతు ధరను అధిగమించి పత్తి ధరలు పలికే అవకాశాలు కనిపిస్తుండటంతో, సీసీఐ కొనుగోళ్లకు పెద్దగా అవకాశం ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దేశీయ స్పిన్నింగ్, టెక్స్‌టైల్ పరిశ్రమల్లో ముడి పత్తికి డిమాండ్ నిలకడగా కొనసాగుతోంది.

ధరలను ప్రభావితం చేసే అంశాలు

దేశీయ పత్తి లభ్యత, దిగుమతులపై డ్యూటీ మినహాయింపు, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు మరియు కొత్త పంట దిగుబడి అనే నాలుగు ప్రధానాంశాలు రానున్న రోజుల్లో పత్తి ధరను నిర్ణయించనున్నాయి. ప్రస్తుతం మార్కెట్ ధర మద్దతు ధర కంటే పైనే ఉండటంతో రైతుకు సీసీఐ కంటే ప్రైవేట్ మార్కెట్ ధరే లాభసాటిగా మారింది. అయితే కొత్త పత్తి భారీగా మార్కెట్‌కు వచ్చే సమయంలో ధరలు తగ్గుముఖం పడితే పరిస్థితి మారే అవకాశం ఉంది. ధరలు ఒకవేళ మద్దతు ధర కంటే దిగువకు పడిపోతేనే సీసీఐ కొనుగోళ్లు రైతుకు రక్షణగా నిలుస్తాయి.

దిగుమతులపై డ్యూటీ ఎత్తివేత ప్రభావం

దేశీయ టెక్స్‌టైల్ పరిశ్రమకు పత్తి లభ్యత పెంచడంతో పాటు ముడిసరుకు వ్యయాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు పత్తి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ, వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సెస్‌ను పూర్తిగా మినహాయించింది. గతంలో పత్తి దిగుమతులపై 11% వరకు డ్యూటీ ఉండేది. దేశీయంగా పత్తి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో విదేశీ పత్తి దిగుమతులు పెరిగి, 2025-26లో ముడి పత్తి దిగుమతులు 10.13 లక్షల టన్నులకు చేరాయి. దేశీయ మార్కెట్లో ధరలు అధికంగా ఉన్నప్పుడు ఈ దిగుమతులు మిల్లులకు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 18 Sept 2026 | 12:54 PM IST
Tags: