జాబ్స్ డెస్క్: తెలంగాణలో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కీలక ఘట్టం ఆరంమైంది. పోలీసు ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రాతపరీక్ష తేదీలను పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు అధికారికంగా వెల్లడించారు. ఎస్‌ఐ సివిల్ తత్సమాన పోస్టులకు నవంబర్ 29న, కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు డిసెంబర్ 20న రాతపరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో మొత్తం 7,437 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ ఏడాది జూలై 29న నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ అయిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది.

దరఖాస్తుల పూర్తి వివరాలు

  • ఈ ప్రక్రియలో భాగంగా ఎస్‌ఐ, ఏఎస్‌ఐ స్థాయి పోస్టులు 298 కాగా, కానిస్టేబుల్ స్థాయి పోస్టులు 7,139 ఉన్నాయి. ఇందులో దాదాపు 5,000 పోస్టులు కేవలం పోలీసు శాఖకు సంబంధించినవే కావడం గమనార్హం.

  • గత నెల 19 నుంచి ఈనెల 16వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 4.29 లక్షల మంది అభ్యర్థులు 5,77,064 దరఖాస్తులను సమర్పించారు.

  • దరఖాస్తు చేసిన వారిలో ఒకే పోస్టుకు దరఖాస్తు చేసుకున్నవారు 68.45% ఉండగా, రెండు పోస్టులకు దరఖాస్తు చేసిన వారు 28.88% మంది ఉన్నారు.

  • సామాజిక వర్గాల వారీగా చూస్తే.. బీసీ అభ్యర్థుల నుంచి అత్యధికంగా 49.19%, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి 43.60%, ఓసీ అభ్యర్థుల నుంచి 7.20%, ఇతర రాష్ట్రాల వారి నుంచి 3.45% దరఖాస్తులు అందాయి.

  • మొత్తం దరఖాస్తుదారుల్లో పురుషులు 4,30,844 (74.66%) మంది ఉండగా, మహిళలు 1,46,220 (25.33%) మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్‌కు గడువు

ఇంతవరకు ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్‌ను పూర్తి చేయని అభ్యర్థులకు బోర్డు మరో అవకాశం కల్పించింది. ఇంకా 2.6% మంది అథెంటికేషన్ పూర్తి చేయాల్సి ఉండగా, వారికి ఈనెల 30వ తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు.

పరీక్ష కేంద్రాల వివరాలు

ఎస్‌ఐ పరీక్షలను తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లా కేంద్రాలలో నిర్వహిస్తామని, అలాగే కానిస్టేబుల్ పరీక్షలను 10 ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు మరో 15 నుంచి 18 అదనపు కేంద్రాల్లో నిర్వహించే అవకాశం ఉందని బోర్డు అధికారులు వివరించారు. అభ్యర్థులు తదనుగుణంగా తమ ప్రిపరేషన్‌ను వేగవంతం చేయాలని సూచించారు.

Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 18 Sept 2026 | 12:12 PM IST
Tags: