అంతర్జాతీయ డెస్క్: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వ్యక్తిగత జీవితంలో మరో కీలక, సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఆయనతో ఐదేళ్లకు పైగా సన్నిహితంగా కలిసి ఉంటున్న శివోన్ జిలిస్ తమ బంధం ముగిసినట్లు బహిరంగంగా ప్రకటించారు. ఎలాంటి ముందస్తు సంకేతాలు లేదా కారణాలు లేకుండానే మస్క్ తమ సంబంధానికి అకస్మాత్తుగా ముగింపు పలికారని ఆమె వెల్లడించారు. ప్రముఖ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న జిలిస్ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తమ బంధం ఇంత హఠాత్తుగా ముగుస్తుందని కలలో కూడా ఊహించలేదని జిలిస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విడాకుల ప్రకటనకు కొద్ది రోజుల ముందే.. సెప్టెంబర్ 24న మస్క్‌తో జరిగిన వ్యక్తిగత సందేశాల సంభాషణను కూడా ఆమె బయటపెట్టారు. ఆ రోజు ఇద్దరూ కలిసి అల్పాహారం తీసుకున్నారని, ఒకరిపై మరొకరు ప్రేమను వ్యక్తం చేసుకున్నట్టు ఆ మెసేజ్‌లు స్పష్టం చేస్తున్నాయి. అయితే, కేవలం వారాల వ్యవధిలోనే పరిస్థితి పూర్తిగా మారిపోవడం గమనార్హం.
పిల్లల సంరక్షణ బాధ్యతలు కలిసికట్టుగా..
మస్క్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయనకు ప్రేమ, ప్రశాంతతను అందించేందుకు నిరంతరం ప్రయత్నించినట్లు జిలిస్ తెలిపారు. తనతోపాటు పిల్లలు కూడా మస్క్‌కు మానసిక ప్రశాంతత లభించేలా ఒక కుటుంబ వాతావరణాన్ని అందించామని చెప్పారు. విడిపోవడం తీవ్ర బాధను కలిగిస్తున్నప్పటికీ.. ఎలాన్ మస్క్ జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇద్దరం మంచి స్నేహితులుగా కొనసాగడంతో పాటు, నలుగురు పిల్లల సంరక్షణ బాధ్యతలను కలిసికట్టుగా నిర్వర్తిస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత సంతతికి చెందిన శివోన్ జిలిస్ కెనడాలో జన్మించారు. 2020లో ఎలాన్ మస్క్‌తో ఆమెకు వ్యక్తిగత అనుబంధం ఏర్పడింది. అప్పటి నుంచి వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూ వీరిద్దరూ అత్యంత సన్నిహితంగా మెలిగారు. మస్క్, జిలిస్ దంపతులకు మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు. 2021లో వీరికి కవలలు స్ట్రైడర్, అజూర్ జన్మించగా.. అనంతరం 2024లో కుమార్తె ఆర్కేడియా, 2025లో కుమారుడు సెల్డన్ జన్మించారు.


