హైదరాబాద్: తనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించడాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. తనపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కోర్టు తీర్పుపై తాను సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని ఆయన తేల్చిచెప్పారు.
ఖైరతాబాద్ ఉపఎన్నికలో పోటీ చేయడానికి తాను పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నానని కుండబద్దలు కొట్టారు. రాజకీయాల్లో ఎన్నికలు తనకు కొత్తేమీ కాదని, ఉప ఎన్నిక ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమని పేర్కొన్నారు. ఇక్కడి వరకు ఒక యోధుడిలా పోరాడుతూనే వచ్చానని, రానున్న ఈ ఎన్నికల్లోనూ గట్టిగా పోరాడి ఘన విజయం సాధిస్తానని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన దానం నాగేందర్.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన న్యాయస్థానం శుక్రవారం దానంపై అనర్హత వేటు వేస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ పరిణామంతో ఖైరతాబాద్లో త్వరలో ఉపఎన్నిక జరిగే అవకాశం ఉండటంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడెక్కాయి.


