హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి విజయం సాధించిన దానం నాగేందర్.. ఆ తర్వాత 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. పార్టీ మారిన ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి ఆగస్టు 21న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఈ కేసంలో తీర్పు వెలువరిస్తూ దానం నాగేందర్ను అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. అంతకుముందు స్పీకర్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును పిటిషనర్లు సవాల్ చేయగా.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే అంశాలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది.
స్టే అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు
హైకోర్టు తీర్పు వెలువడిన అనంతరం దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. తీర్పు అమలుపై స్టే విధించాలని, సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే వరకు గడువు ఇవ్వాలని కోరారు. ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేను పదవి నుంచి తొలగిస్తే నియోజకవర్గ ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని వాదించారు. అయితే దానం లాయర్ల స్టే అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.


