గన్నేరువరం: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ఎలాంటి జాప్యం లేకుండా అర్హులైన పేదలకు కేటాయించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయాంలో శంకుస్థాపన చేసి ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు ప్రస్తుత ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని కోరారు. మండల వ్యాప్తంగా నిజమైన అర్హులను గుర్తించి వారికి ఆ ఇండ్లను అందజేయాలని డిమాండ్ చేశారు.

ఈ సమస్యపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈనెల 6వ తారీకు మంగళవారం రోజున గన్నేరువరం మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని నాయకులు ప్రకటించారు. ఈ ముట్టడి కార్యక్రమానికి సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఇండ్లు వచ్చే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.

ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కాంతాల అంజిరెడ్డి, మండల కార్యదర్శి చొక్కాల శ్రీశైలం, సహాయ కార్యదర్శులు కూన మల్లయ్య, పిప్పల కనుకయ్య, గుండ్లపల్లి గ్రామ కార్యదర్శి బోయిని తిరుపతి, గన్నేరువరం గ్రామ సహాయ కార్యదర్శి బొమ్మకంటి అంజయ్యచారి, మండల నాయకులు ఎండీ నయీమ్, రాపోలు రాజమల్లు, అంజన్న, జలపతి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 3 Oct 2026 | 10:35 PM IST
Tags: