హైదరాబాద్: పండగ సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి-తిరువణ్ణామలై మధ్య 14 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 6 నుంచి నవంబరు 18 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ వెల్లడించారు.
ప్రతీ మంగళవారం చర్లపల్లి నుంచి తిరువణ్ణామలైకి (07003 నెంబర్), ప్రతీ బుధవారం తిరువణ్ణామలై నుంచి చర్లపల్లికి (07004 నెంబర్) ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. మార్గమధ్యంలో కాచిగూడ, షాద్నగర్, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, కర్నూలు, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి స్టేషన్లలో (ఇరువైపులా) ఈ రైళ్లకు హాల్ట్ ఉంటుందని సీపీఆర్ఓ తెలిపారు.
వెంకటాద్రి ఎక్స్ప్రెస్కు నందలూరులో హాల్ట్..
కాచిగూడ-చిత్తూరు మధ్య రాకపోకలు సాగించే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ (12797/98) రైలుకు నందలూరులో (ఇరువైపులా) హాల్ట్ సదుపాయం కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. శనివారం నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని సీపీఆర్ఓ శ్రీధర్ స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


