వికారాబాద్: అనంతగిరి ఘాట్ రోడ్డులో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శంకర్పల్లి కేసారం నుంచి ధారూర్ మండలం చింతకుంటకు నారాయణ రెడ్డి అనే వ్యక్తి అంత్యక్రియల నిమిత్తం ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అనంతగిరి ఘాట్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 52 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘోర ప్రమాదంలో ప్రమీల (52), యాదమ్మ (52), మాల పద్మ (50), పద్మమ్మ (55) నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను వెంటనే వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద కారణాలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, మెరుగైన వైద్య సాయం అందించాలని వైద్యులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి..
అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.


