యాదాద్రి భువనగిరి: తెలంగాణ చేనేత కళాకారుడి ప్రతిభకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు ఎట్టు బంతి (గంజి) వెంకటేశ్ ప్రతిష్టాత్మక 'జాతీయ చేనేత పురస్కారం–2025'కు ఎంపికయ్యారు.
15 నెలల శ్రమ.. ఇక్కత్ డిజైన్‌లో అద్భుతం
ప్రకృతి, జీవజాలం నేపథ్యంతో ఇక్కత్ డిజైన్ మేళవించి ఆరు గజాల పట్టు చీరపై ఆయన అద్భుతంగా ఆవిష్కరించారు. గత 34 ఏళ్లుగా చేనేత రంగంలోనే కొనసాగుతున్న వెంకటేశ్, ఈ ప్రత్యేకమైన చీరను రూపొందించేందుకు ఏకంగా 15 నెలల పాటు నిరంతరం శ్రమించారు. ఆయన సృజనాత్మకతకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది.
రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ప్రదానం
ఆగస్టు 7న న్యూఢిల్లీలో నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా గంజి వెంకటేశ్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. తెలంగాణ నేతన్న ప్రతిభ జాతీయ స్థాయిలో వెలుగొందడం పట్ల స్థానికులు, చేనేత కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


