హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న "ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్" కార్యక్రమంలో భాగంగా తెలంగాణ విద్యార్థుల బృందం హర్యానా రాష్ట్రంలో వారం రోజుల పాటు (ఈ నెల 15 నుండి 22 వరకు) పర్యటించింది. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, సమగ్ర శిక్ష ఎస్పీడీ డాక్టర్ ఈ. నవీన్ నికోలస్ మరియు అధికారుల మార్గదర్శకత్వంలో ఈ పర్యటన విజయవంతంగా ముగిసింది.
తెలుగు సంస్కృతికి నీరాజనం
పర్యటనలో భాగంగా కురుక్షేత్ర జిల్లాలోని సైనిక్ పాఠశాల, షాబాద్ సీనియర్ సెకండరీ పాఠశాల, జై శ్రీరామ్ విద్యాపీఠాలను విద్యార్థులు సందర్శించారు. అక్కడ తెలంగాణ విశిష్ట సంస్కృతి అయిన బతుకమ్మ, బోనాలు, ఒగ్గుకథలు మరియు జానపద నృత్యాలను ప్రదర్శించి విశేష ప్రశంసలు అందుకున్నారు. అలాగే హర్యానీ భాషలో సంభాషించి అక్కడి వారిని ఆకట్టుకున్నారు.
జాతీయ సమైక్యత దిశగా..
రెండు రాష్ట్రాల విద్యార్థుల మధ్య సాంస్కృతిక బంధం, జాతీయ సమైక్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. కురుక్షేత్ర సైన్స్ మ్యూజియం వంటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలను కూడా బృందం సందర్శించింది. ఈ పర్యటనలో ఎస్‌సీఈఆర్‌టీ ప్రతినిధి మధుసూదన్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు ఎస్.కె. తాజ్ బాబు, ఎస్కార్ట్ ఉపాధ్యాయులతో పాటు మొత్తం 26 మంది విద్యార్థులు పాల్గొన్నారు.


